జాన్‌పహాడ్‌ దర్గా గంధోత్సవంలో పాల్గొననున్న హోంమంత్రి మహమూద్‌ అలీ


జిల్లాలోని పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్‌ దర్గా ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడురోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజైన గురువారం వేకువజామునే దర్గా పూజారి సయ్యద్‌ అలీబాబా, జానీల ఇంటి నుంచి మేళతాళాలతో గంధ కలశాలను, దట్టీలను ఊరేగింపుగా దర్గాకు తీసుకొచ్చారు. దర్గాలోని హజ్రత్‌ సయ్యద్‌, మొహినుద్దీనా షా సమాధులతోపాటు వెలుపల ఉన్న సైనిక బృందాల సమాధులపై గంధం చల్లి, పూలు, దట్టీలతో అలంకరించారు. సమాధుల చుట్టూ మహిళలు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సమీపంలో గల నాగదేవతకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. నేడు జరిగే గంధం ఊరేగింపునకు హోంమంత్రి మహమూద్‌ అలీ, హుజూర్‌నగర్‌, కోదాడ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌, భాస్కర్‌రావు తదితరులు హాజరుకానున్నారు. హోంమంత్రి ఇప్పటికే దామరచర్ల మండల కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు మహమూద్ అలీకి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకునే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.